వాహనదారులకు బిగ్ షాక్: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు... పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాాయా?
దేశంలోని వాహనదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. సీఎన్‌జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

దేశంలోని వాహనదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. సీఎన్‌జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. ఈరోజు (మే 17) నుంచి సీఎన్‌జీ ధర కిలోకు రూపాయి చొప్పున పెరిగింది. అయితే సీఎన్‌జీ ధరల పెంపు 48 గంటల వ్యవధిలో రెండు సారి కావడం గమనార్హం. రెండ్రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా మరోసారి కిలో సీఎన్‌జీ ధరను రూ. 1 పెంచింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 80.09కి, నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది.
మెట్రో నగరాలతో పాటు ఇతర నగరాల్లో కూడా బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలలో అధిక భాగం ఇప్పుడు సీఎన్‌జీతో నడుస్తున్నందున... సీఎన్‌జీ ధరలలో ఈ వరుస పెంపు వాహనదారులతో పాటు, ప్రజా రవాణా వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
ప్రపంచ చమురు ధరలు పెరగడం వల్ల ఏర్పడిన నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా మే 15న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు... పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచాయి. ఇప్పటికే అధికంగా ఉన్న ఇంధన ధరల భారానికి ఇప్పుడు సీఎన్‌జీ పెంపు కూడా తోడైంది.






