తుఫాన్ బీభత్సానికి ముందు ప్రశాంతత...: ట్రంప్ సంచలన పోస్టు
అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులను మళ్లీ ప్రారంభిస్తుందా? అనే ప్రశ్నలు కొద్ది రోజులుగా తలెత్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులను మళ్లీ ప్రారంభిస్తుందా? అనే ప్రశ్నలు కొద్ది రోజులుగా తలెత్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ట్రంప్ ఒక ఏఐ జనరేట్ చేసిన ఫొటోను షేర్ చేయగా... అందులో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకల వద్ద నిలబడిన ట్రంప్ వేలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఫొటోలో... తుఫాను బీభత్సానికి ముందు ప్రశాంతత (It Was The Calm Before The Storm) అనే సందేశాన్ని ఉంచారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య తొలి విడత శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య రెండో విడత చర్చల కోసం మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నాలు చేసినప్పటికీ... అవి ఫలించలేదు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య యుద్దం పూర్తిగా ఆపేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ట్రంప్ నుంచి ఈ పోస్టు రావడం చర్చనీయాంశంగా మారింది.
ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం... అమెరికా, ఇరాన్‌ల మద్య శాంతి చర్చలలో వేగం తగ్గిన నేపథ్యంలో అమెరికా సాధ్యమయ్యే తదుపరి దశ కార్యకలాపాల కోసం ప్రణాళికలను సిద్దం చేసింది. దీనిని అంతర్గతంగా ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0’’ అని పిలుస్తున్నట్లు సమాచారం.






