రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ.50 లక్షలు నిధులు మంజూరు
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్: సెప్టెంబర్ 15 :
నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంగళవారం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన 46 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 32లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం నిధులు అందించాలని ఇదివరకు జిల్లా ఇంచార్జి మంత్రిగా వ్యవహరించిన జూపల్లి కృష్ణారావు ను కోరడం జరిగిందని అన్నారు. ఈ మేరకు మంత్రి జూపల్లి పర్యాటక శాఖ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో గెస్ట్ హౌస్ మరమ్మతులకు, సిద్ధుల గుట్ట కాటేజీ, అతిథి గృహం నిర్మాణాలకు 50 లక్షలు, భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 4 కోట్ల చొప్పున జిల్లాకు మొత్తం రూ. 5కోట్ల నిధులు మంజూరు చేశారని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ నిధుల కోసం తనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కృషి చేశారని తెలుపుతూ, ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు మహేష్ కుమార్ కు కృతఙ్ఞతలు ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.






