మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను అట్టహాసంగా ప్రారంభించిన ఇంచార్జి మంత్రి సీతక్క

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను అట్టహాసంగా ప్రారంభించిన ఇంచార్జి మంత్రి సీతక్క
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
నూతన చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాలు పంపిణీ
లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
భూరక్ష యాప్ ఆవిష్కరణ
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:నిజామాబాద్, నవంబర్ 20 :
మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయూతను అందిస్తోందని ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరీ పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఖానాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ..మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయూతను అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో మహిళలు వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తూ ఆర్థిక స్వావలంబనతో శాసించే స్థాయికి ఎదిగేలా జిల్లా యంత్రాంగాలు వారికి తోడ్పాటును అందించాలని మంత్రి సీతక్క సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను మహిళల పేరిట మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నూతనంగా చేయూత పెన్షన్లను మంజూరు చేసిందని, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 20వేల పైచిలుకు మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఇదివరకు పెన్షన్లు పొందుతున్న వారిలో ఏ ఒక్కరి పెన్షన్ కూడా తొలగించలేదని, కేవలం చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించబడ్డాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. త్వరలోనే వృద్ధాప్య పింఛన్లు కూడా అర్హులైన కొత్త వారికి అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందని ఆక్షేపించారు. అప్పుల తాలూకు ప్రతీ నెల 6వేల కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేల్లిస్తోందని అన్నారు. అయినప్పటికీ పేదల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తోందని, అదికూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎవరికీ పైసా చెల్లించే పరిస్థితి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోందని అన్నారు. గుడిసెలు లేని తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో గుడిసెలలో నివసిస్తున్న వారికి రెండవ విడతలో ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
భూరక్ష యాప్ ఆవిష్కరణ
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ట్రైనీ కలెక్టర్ పి.సురేష్ రూపొందించిన భూరక్ష యాప్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సాంకేతిక, సుపరిపాలనను అనుసంధానిస్తూ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు వీలుగా యాప్ రూపొందించడం గొప్ప విషయమని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ను, ట్రైనీ కలెక్టర్ సురేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.






