జర్నలిస్టు వడ్డూరి మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జర్నలిస్టు వడ్డూరి మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
-నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
మన ఇందూర్ న్యూస్ / హైదరాబాద్:
అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు తో మరణించిన సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాసరావు బౌతిక కాయానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనివాసరావు బౌతిక కాయానికి నాగోల్ స్మశాన వాటిలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన మామిడి సోమయ్య శ్రీనివాసరావు బౌతిక కాయం పై పూలమాల ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యడు కుంచం శ్రీనివాస్ కూడా శ్రీనివాసరావు కు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను మామిడి సోమయ్య పరామర్శించి ఓదార్చారు. నలభై ఏళ్ళుగా జర్నలిజం వృత్తిలో కొనసాగిన వడ్డూరి శ్రీనివాసరావు చివరిదాకా వృత్తిని నమ్ముకొని, నీతి నిజాయితీతో జీవించారని మామిడి సోమయ్య పేర్కొన్నారు. పలు ప్రధాన పత్రికల్లో సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్ గా నిబద్దతతో పని చేసిన శ్రీనివాసరావు మరణం మీడియా రంగానికి, జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. శ్రీనివాసరావు జర్నలిస్టుగా నలభై ఏళ్ళు పనిచేసినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందలేకపోయారని, ఇంటి స్థలం కల నెరవేరకుండానే చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికంలో ఉన్న శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.






