Mana Indur News
తెలంగాణ

కామారెడ్డి మున్సిపల్ లో చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిది భర్త

రూ.6 లక్షల అభివృద్ధి పనులకు చైర్మన్ జాప్యంపై కౌన్సిలర్ల అసంతృప్తి

KA
By KARKA RAMESH•October 14, 2026
31
Share
కామారెడ్డి మున్సిపల్ లో చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిది భర్త

కామారెడ్డి మున్సిపల్ లో చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిది భర్త పెత్తనం

రూ.6 లక్షల అభివృద్ధి పనులకు చైర్మన్ జాప్యంపై కౌన్సిలర్ల అసంతృప్తి

సమావేశం జరిగి 50 రోజులైనా సీ ఆర్ ఫైల్‌కు జాప్యమెందుకో

వార్డుల అభివృద్ధికి రాజకీయ గ్రహణం!

షబ్బీర్ అలీ ఆదేశించినా ముందుకు సాగని టేబుల్ ఎజెండా పనులు

మన ఇందూర్ న్యూస్/కామారెడ్డి:

కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ భర్త పెత్తనం సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. అధికారిక, అనదికారిక పనుల్లో చైర్మన్ భర్త ఇప్ప శ్రీనివాస్ అన్నింటా తానై వ్యవహరిస్తూ లావాదేవీలు నిర్వహిస్తూన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్ లో అభివృద్ధి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగుల వెనక్కి అన్న చందంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్ తమ ఇష్టారాజ్యాంగ కొనసాగుతు లావాదేవీలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పనులు కేటాయిస్తున్నారంటూ ప్రతిపక్ష BRS, BJP కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణిని పలుమార్లు నిలదీశారు. అధికార పక్ష వైఖరిపై, కమిషనర్ పర్వతాలు తీవ్ర పట్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతలకు, వాగ్వాదాలకు దారితీస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి, కమీషన్ల దందా సాగుతోందని స్థానిక విపక్ష నాయకులు, సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం ఆరోపిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అనధికారిక నిర్మాణాలు, అనుమతుల జారీలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ (ACB) అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను సైతం ఇటీవలే పరిశీలించినట్లు సమాచారం.నిర్ణీత గడువు ముగిసినా కొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని అధికారులు గుర్తించారు. పాలకవర్గ నిర్ణయాలు, పనుల కేటాయింపులపై కౌన్సిలర్ల మధ్య తీవ్ర వివాదాలు, రసాభాసలు చోటుచేసుకుంటున్నాయి. చైర్మన్ భర్త ఇప్ప శ్రీనివాస్ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. అన్ని నిర్ణయాల్లో చైర్మన్ భర్త జోక్యం పెరిగిపోయిందని విమర్శలు చేస్తున్నారు.

కామారెడ్డి మున్సిపల్‌లో రాజకీయ ఆధిపత్య పోరు వార్డుల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందా అనే ప్రశ్న తలెత్తుతుంది. కామారెడ్డి పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలోనూ రాజకీయాలు జోక్యం చేసుకుంటునన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బతుకమ్మ, దేవి నవరాత్రులు, దసరా పండగల నేపధ్యంలో ప్రత్యేక సమావేశం పెట్టాల్సి ఉండగా మున్సిపల్ చైర్మన్ మాత్రం తమకేమి పట్టనట్లు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో టేబుల్ ఎజెండాలో చేర్చిన వార్డు అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.6 లక్షల నిధుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమావేశం జరిగి సుమారు 50 రోజులు కావస్తున్నా, సంబంధిత పనులకు మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి సంతకం అలస్యంలో ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

అధికారులు వెళ్లినా.. వారికి నిరాశే

పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు చైర్మన్ ఇప్ప ఉమారాణి సంతకం కోసం వెళ్లినప్పటికీ, వారికి నిరాశే ఎదురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైళ్లపై సంతకాలు చేయకుండా వెనక్కి పంపుతున్నారనే ప్రచారం మున్సిపల్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పనుల విషయంలో ఇంత జాప్యం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఆగస్టు 29న జరిగిన మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో టేబుల్ ఎజెండా కింద 6లక్షల పనులకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు నెలలు కావస్తున్నా మున్సిపల్ చైర్మన్ సంతకం చేయడం ఆలస్యంపై విమర్శలు వస్తున్నాయి.

షబ్బీర్ అలీ ఆదేశించినా ఫలితం శూన్యమా?

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సైతం టేబుల్ ఎజెండా పనులకు సంతకాలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. పలు మార్లు స్వయంగా, ఫోన్ ద్వారా ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు సంతకం జరగకపోవడంపై రాజకీయ వర్గాల్లో, కౌన్సిల్ లో చర్చ జరుగుతోంది. ఈ జాప్యానికి కారణాలేమిటి? అభివృద్ధి పనుల ఫైల్‌పై సంతకం నిలిచిపోవడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై మున్సిపల్ చైర్మన్ వివరణ వెలువడితేనే జాప్యానికి అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ప్రజా సమస్యల కంటే రాజకీయాలే ముఖ్యమా?

కామారెడ్డి మున్సిపల్‌లో తరచూ తలెత్తుతున్న వివాదాలు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా 49 వార్డుల్లో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సమస్యల పరిష్కారంపై తగినంత దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే, పాలకవర్గంలోని విభేదాలు అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పలు వార్డుల్లో తాగు నీటి ఎద్దడి వల్ల మోటార్లు కాలిపోయిన రిపేర్ చేయడంలో ఇంజనీరింగ్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సంతకం ఎప్పుడు? పనులు ఎప్పటికి?

రూ.6 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైల్ ఎప్పుడు కదులుతుంది? మున్సిపల్ చైర్మన్ సంతకం ఎప్పుడు లభిస్తుంది? వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. రూ.6 లక్షల పనులకు సంతకం కాగానే ఇంజనీరింగ్ విభాగం పనులకు టెండర్ పిలిచి వెంటనే చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది. మున్సిపల్ చైర్మన్ భర్త అన్ని విభాగాల్లో పెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బతుకమ్మ, దేవి నవరాత్రులు, దసరా పండగల నేపధ్యంలో ప్రత్యేక సమావేశం పెట్టాల్సి ఉండగా చైర్మన్ మాత్రం తమకేమి పట్టనట్లు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5