ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
రాష్ట్రంలో డిసెంబర్ నెలలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 13 నుండి ఐదు రోజుల పాటు టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు కొనసాగుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఖేలో ఇండియా క్రీడా పోటీలను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సంబంధిత అధికారులతో క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖేలో ఇండియా పోటీలకు సంబంధించి టేబుల్ టెన్నిస్ కోసం నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. మాక్లూర్ మండలం దాస్నగర్ సమీపంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ స్టేడియంలో ఖేలో ఇండియా గేమ్స్ లో భాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు జరుగుతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చాలని, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, ఖేలో ఇండియా గేమ్స్ ను వేదికగా మలుచుకుని క్రీడలపై విద్యార్థులలో, యువతలో మరింత ఆసక్తి పెంపొందించేలా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల యువత మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండేలా కృషి చేసినట్లు అవుతుందన్నారు. అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు తెలిసేలా లోగో, మస్కట్ లను ప్రదర్శించాలని, సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేయాలని, క్విజ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు, లోగోలు, మస్కట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐ.డీ.ఓ.సీ, ఓల్డ్ కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రముఖ ప్రాంతాల్లో మస్కట్, లోగోతో కూడిన కటౌట్లు, స్టాండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన సంఘాలు, క్రీడా సంఘాల భాగస్వామ్యంతో ఖేలో ఇండియా రన్, వాకథాన్ లేదా సైక్లోథాన్ వంటి కార్యక్రమాలను చేపట్టి క్రీడల ప్రాధాన్యతను చాటాలన్నారు.
సమీక్షలో ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీవైఎస్ఓ పవన్ కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






