Mana Indur News
క్రీడలు

ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేలా అట్టహాసంగా జాతీయ యువజన క్రీడలు

MI
By Mana Indur News•November 20, 2026
1
Share
ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేలా అట్టహాసంగా జాతీయ యువజన క్రీడలు

ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్, నవంబర్ 20 :

విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా జాతీయ యువజన క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ధనసరి అనసూయ సూచించారు. ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్–2026లో భాగంగా నిజామాబాద్ జిల్లా వేదికగా డిసెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. దాస్ నగర్ సమీపంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన ఖేలో ఇండియా లోగో, మస్కట్ లను శుక్రవారం రాత్రి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జిల్లా ఇంచార్జి మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, క్రీడా పోటీలకు నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, డీ.ఆర్.ఓ గీత, డీ.వై.ఎస్.ఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో జరిగే ఈ క్రీడా పోటీల గురించి విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను లాంచనంగా ప్రారంభించి, మంత్రి సీతక్క స్వయంగా సెల్ఫీ దిగారు. ఖేలో ఇండియా లోగోతో ముద్రించిన టీషర్ట్ లు, క్యాప్ లను ఆవిష్కరించి, ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో జాతీయ యువజన క్రీడలు నిర్వహించనున్నదని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ లో డిసెంబర్ 13 నుండి 17వరకు ఐదు రోజుల పాటు టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయని వెల్లడించారు. జాతీయ స్థాయి క్రీడలకు ఆతిథ్యమివ్వడం జిల్లాకు గర్వకారణమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా యువత, క్రీడాకారులకు క్రీడలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఖేలో ఇండియా క్రీడల విశేషాలు ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలిచే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా గొప్పగా నిర్వహించాలని అధికారులకు హితవు పలికారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని అన్నారు. జిల్లాలోని క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో ఖేలో ఇండియా లోగో, మస్కట్‌తో కూడిన కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ క్రీడల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి క్రీడాస్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5