ప్రైవేట్ ఆస్పత్రుల్లో బ్రెస్ట్ఫీడింగ్ క్యాబిన్లు ఏర్పాటు చేయాలి
అవేదన వ్యక్తం చేసిన సిపిఐ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మంద స్వరూప రాణి

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
ప్రైవేట్ ఆస్పత్రుల్లో బ్రెస్ట్ఫీడింగ్ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని సిపిఐ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మంద స్వరూప రాణి డిమాండ్ చేశారు.నిత్యం ప్రైవేట్ ఆస్పత్రులకు పిల్లల వైద్యం కోసం వచ్చే బాలింతల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, తప్పనిసరి పరిస్థితుల్లో రిసెప్షన్ క్యాబిన్ ముందే తల్లులు పాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఓపీ కి 300 నుంచి 500 ఫీజు
ప్రైవేట్ చిల్డ్రన్ ఆస్పత్రుల్లో ఓపి కి 300 నుంచి 500 వరకు ఫీజు తీసుకుంటున్నారని, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని వెంటనే సంబంధిత అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రిల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నగరంలోని ప్రధాన చిల్డ్రన్ ఆస్పత్రులలో వైద్యం కోసం, డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం రిసెప్షన్ కౌంటర్ వద్ద గంటల తరబడి కూర్చొని ఉండాల్సి వస్తుందని, అలాంటి సమయంలో చిన్నపిల్లలకు పాలు పట్టాల్సిన వస్తే, కూర్చున్న చోటే ఇవ్వాల్సి వస్తుందని, కొంత మంది మాతృమూర్తులు మొహమాటంతో పిల్లలు ఏడుస్తున్న పాలు పట్టలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, పాలు సమయానికి పట్టలేకపోవడం వల్ల పిల్లలకు అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. మహిళ సాధికారత కేంద్రం (DHEW), మహిళ శిశు దివ్యంగుల శాఖ, భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం ఆధ్వర్యంలో బస్ స్టాండ్, కోర్టులో, ఐ డి ఓ సి కాంప్లెక్స్ కు వచ్చే తల్లులు తమ పిల్లలకు ఏలాంటి ఆసౌకర్యం లేకుండా పాలు ఇచ్చేలా క్యాబిన్లు ఏర్పాటు హర్షణీయం అన్నారు. ఈ దిశగానే ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో సైతం బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.






