మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ధర్నా చౌక్ లో చేపట్టిన సమ్మెకు మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, లైన్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో చేపట్టిన సమ్మెకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు హాజరై తన పూర్తి మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: మున్సిపల్ కార్మికులు తన కుటుంబ సభ్యులతో సమానమని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.ప్రభుత్వం వెంటనే జీవో 52ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 19,500 వేతనాన్ని పెంచి, కనీస వేతనంగా ₹26,000 అందించాలని కోరారు. ప్రతి నెలా 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, రాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఐడెంటిటీ కార్డులు (ID Cards) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల కోసం ₹20,000 తక్షణ సాయం అందించాలని, అలాగే మృతుల కుటుంబ సభ్యులకు (వయోపరిమితి సడలించి) ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నగరం అంధకారంలోకి
వినాయక చవితి ఉత్సవాల వేళ వీధిదీపాలు వెలగక నగరం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని, దీనివల్ల ప్రజలకు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని గుర్తుచేశారు.ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో సేవలు అందించిన మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం దయతో వ్యవహరించాలని, కార్మికుల సమ్మె వల్ల నగరంలో పారిశుధ్యం, విద్యుత్ దీపాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను తీర్చాలని కోరారు.కార్మికులు కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవని, అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గార్లు చర్చలు జరిపి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్ నవీద్ ఇక్బాల్,జగత్ రెడ్డి,అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.






