సేవా గణపతి వద్ద సుమంగళుల సామూహిక కుంకుమార్చన
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు గరిక పూజతో విశేష పూజా కార్యక్రమాలు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో కొలువుదీరిన సేవా గణపతి వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంగళులు అధిక సంఖ్యలో హాజరై కుంకుమార్చన నిర్వహిస్తూ గణనాథునికి భక్తితో పూజలు చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం, సకల శుభాలు వెల్లి విరియాలని గణపతిని కొలిచారు. కుంకుమార్చన తో పాటు సేవా గణపతికి గరిక పూజను ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించారు.కుంకుమ, గరిక వంటి మంగళద్రవ్యాలతో సేవా గణపతికి పూజలు నిర్వహించడంతో సేవా గణపతి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో అలరించింది. భక్తిశ్రద్ధలతో సాగిన పూజా కార్యక్రమంలో మహిళల సామూహిక భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సేవా గణపతికి సమర్పించిన తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు కార్యవర్గ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






