సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన – పోస్టర్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్
చెల్లింపుకు ముందు ఆగండి – వ్యక్తిని ధృవీకరించుకోండి

సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన – పోస్టర్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్
మీ డబ్బు – మీ క్లిక్ – మీ ఎంపిక
చెల్లింపుకు ముందు ఆగండి – వ్యక్తిని ధృవీకరించుకోండి
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) నవంబర్ నెలను సైబర్ అవగాహన మాసంగా ప్రకటించింది. ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించే " సైబర్ జాగ్రూకత దివస్ తో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బ్యూరో ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో సైబర్ అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., హాజరయ్యారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గారు ఈ దిగువ తెలిపిన విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు అంశాలపై వివరించారు.
1.ప్రకటనల మోసం – వస్తువులు/సేవల డెలివరీ మోసం:
సోషల్ మీడియా , వెబ్సైట్లు , మెసేజింగ్ యాప్‌లలో “70% డిస్కౌంట్”, "మెగా సేల్" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, UPI లేదా బ్యాంకు బదిలీ ద్వారా ముందస్తు చెల్లింపులు తీసుకుంటారు. తర్వాత నకిలీ ఆర్డర్ వివరాలు చూపి, డెలివరీ ఆలస్యమైందని కారణాలు చెప్పి, చివరకు ఫోన్ నంబర్ బ్లాక్ చేసి అదృశ్యమవుతారు. దీనిని నివారించడానికి:తెలియని, ధృవీకరించని విక్రేతల నుంచి కొనవద్దు. అవాస్తవంగా తక్కువ ధరలను నమ్మవద్దు. ప్రముఖ ఈ-కామర్స్ వేదికలనే ఉపయోగించండి. చెల్లింపుకు ముందు విక్రేత వివరాలు, కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లు చూడండి. తెలియని విక్రేతలకు ముందస్తు చెల్లింపు చేయవద్దు.
2.గుర్తింపు దొంగతనం – క్రెడిట్/డెబిట్ కార్డు దుర్వినియోగం:
"కార్డు పరిమితి పెంపు", "క్యాష్‌బ్యాక్", "రివార్డ్ పాయింట్లు" పేరుతో ఫిషింగ్ లింకులు, APK ఫైళ్లు పంపి, కార్డు నంబర్, CVV, OTP, PIN వంటి వివరాలను సేకరిస్తారు. వాటితో బాధితులకు తెలియకుండానే ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తారు. బ్యాంకు నుంచి లావాదేవీ అలర్ట్ వచ్చినప్పుడు లేదా ఖాతా నుంచి డబ్బు తగ్గినప్పుడు మాత్రమే బాధితులకు మోసం తెలుస్తుంది. దీనిని నివారించడానికి , తెలియని వనరుల నుంచి APK ఫైళ్లు, యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దు. కార్డు వివరాలు, CVV, OTP, PIN ఎవరికీ చెప్పవద్దు. బ్యాంకు స్టేట్మెంట్లు, అలర్ట్‌లను క్రమం తప్పకుండా పరిశీలించండి. అనధికార లావాదేవీ జరిగితే వెంటనే కార్డును బ్లాక్ చేసి, బ్యాంకుకు సమాచారం ఇవ్వండి.
3.వ్యాపార మరియు పెట్టుబడి మోసం – స్టాక్స్: సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో "గ్యారంటీ లాభాలు", "డబుల్ మనీ", “VIP ఇన్వెస్ట్మెంట్ గ్రూప్” పేరుతో ప్రకటనలు ఇస్తారు. స్టాక్ నిపుణులుగా నటించి, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, APK ఫైళ్లు పంపుతారు. యాప్‌లో నకిలీ లాభాలు చూపి, మరింత పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. పెద్ద మొత్తం జమ అయ్యాక విత్‌డ్రాలను నిలిపివేసి అదృశ్యమవుతారు. దీనిని నివారించడానికి: సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో వచ్చే స్టాక్ చిట్కాలను నమ్మవద్దు. APK ఫైళ్లు లేదా అనుమానాస్పద లింకుల ద్వారా ట్రేడింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు. అసాధారణంగా అధిక రాబడి, గ్యారంటీ లాభాల హామీలపై అప్రమత్తంగా ఉండండి. బ్రోకర్లు, పెట్టుబడి సలహాదారుల వివరాలను SEBI వంటి అధికారిక సంస్థల ద్వారా ధృవీకరించుకోండి. ఒత్తిడి, తొందరపాటు, భావోద్వేగాలకు లోనై పెట్టుబడులు పెట్టవద్దు.ఇతర మోసాలపై హెచ్చరికలుప్రదర్శించిన పోస్టర్ల ఆధారంగా ఈ మోసాల గురించి కూడా వివరించారు:డిజిటల్ అరెస్ట్ మోసం: పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ఫోన్ చేసి, చట్టపరమైన చర్యల పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేస్తారు. పోలీసులు ఎప్పుడూ ఫోన్లో డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు అడగరు. "డిజిటల్ అరెస్ట్" అనే ప్రక్రియే చట్టంలో లేదు.సోషల్ మీడియా నకిలీ ప్రొఫైల్ మోసం: నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి స్నేహం పేరుతో దగ్గరై, మోసం చేయడం లేదా బ్లాక్మెయిల్ చేస్తారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు.ముందు మీకు చెల్లిస్తారు, తర్వాత మిమ్మల్ని చెల్లించమంటారు మోసం: మొదట చిన్న మొత్తం ఇచ్చి నమ్మకం కలిగించి, తర్వాత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టేలా చేస్తారు. సులభ సంపాదన ఆశతో మీ పొదుపును ప్రమాదంలో పెట్టవద్దు.గుర్తింపు రక్షణ: కస్టమర్ కేర్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌లో OTP, PIN, CVV అడిగితే చెప్పవద్దు.స్క్రీన్ షేరింగ్ మోసాలు: తెలియని వ్యక్తుల సూచనలతో స్క్రీన్ షేరింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దు.ఆగండి – ఆలోచించండి – అడుగు వేయండి" అని విద్యార్థులకు సూచించారు:ఆగండి (Stop): ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు లేదా డబ్బు పంపే ముందు ఒక్క క్షణం ఆగండి.ఆలోచించండి (Think): ఆఫర్ నిజంగా సాధ్యమేనా, పంపుతున్నది ఎవరికి అని ఆలోచించండి.అడుగు వేయండి (Take Action): మోసం అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు , కుటుంబ సభ్యులకు , ముఖ్యంగా వృద్ధులకు తెలియజేయాలని, కుటుంబ సభ్యులందరూ సైబర్ భద్రతా నియమాలు పాటించేలా చూడాలని కోరారు.ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి. లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. ఈ సందర్భంగా సైబర్ అవగాహన పోస్టర్లను ముఖ్య అతిథి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో నిజామాబాదు ఏసీపీ ప్రకాష్ , సీసీపీఎస్ ఇన్స్పెక్టర్ మొఖీద్ పాషా , 3 టౌన్ ఎస్హెచ్ఓ హరి బాబు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి కుమార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజన్న , సుమారు 400 మంది విద్యార్థులు , కళాశాల అధ్యాపకులు , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.






