నలభై రెండేళ్ల మహిళను హత్య చేసిన నేరానికి జీవిత ఖైదు
105 పేజీల తీర్పు వెలువరించిన నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్

హత్య, హత్యయత్నం నేరాలలో ఒకరికి రెండు జీవిత కారాగార శిక్షలు
-నలభై రెండేళ్ల మహిళను హత్య చేసిన నేరానికి ఒక జీవిత ఖైదు
-మరో నలుగురిపై హత్యయత్నం చేసిన నేరాలకు జీవిత ఖైదు
-రెండు నేరాలలో పదివేల చొప్పున జరిమానా
-105 పేజీల తీర్పు వెలువరించిన నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
హత్య, హత్యయత్నం నేరాలలో ఒకరికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. నలభై రెండేళ్ల మహిళను హత్య చేసిన నేరానికి ఒక జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. మచ్చ లక్ష్మీ అనే మహిళని (42) కత్తేరతో పొడిచి చంపిన నేరానికి ముద్దాయి కోటగిరి గంగదాస్(43) కు జీవిత కారాగార శిక్ష, లక్ష్మీ కూతురు మచ్చ గౌతమి పై మరో ముగ్గురిపై హత్యయత్నం చేసిన నేరాలకు మరో జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ శుక్రవారం నూట ఐదు పేజీల సుధీర్ఘ తీర్పును వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రజని తెలిపిన తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలోని నివాసులైన మచ్చ లక్ష్మీ ఆమె కూతురు మచ్చ గౌతమి, చెట్పల్లి శోభ, చెట్పల్లి బోజేశ్వర్, చెట్పల్లి నాగరాజు, క్యాదరి శ్రీనివాస్ , ముద్దాయి గంగదాస్ ఆయన భార్య మణి చుట్టుపక్కల వారు. గంగదాస్, మణి ల మధ్య సంసారం విషయంలో భేదాభిప్రాయాలు ఉండేవి.ఈ విషయంలో మచ్చ లక్ష్మీ, నాగరాజు, శోభ,బోజేశ్వర్, శ్రీనివాస్ ఇతరులు గంగదాస్ కు నచ్చజెప్పే వారు. భార్యను మంచిగా చూసుకోవాలని శరీరక, మానసిక భాధలకు గురి చేయవద్దని కోరేవారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు భార్యను పిల్లలను సంతోషంగా ఉంచి ఆనందంగా ఉండాలని కోరేవారు.అయిన అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు పైగా భార్యను చిత్రవదలకు గురిచేసేవాడు.భర్త పెట్టె బాధలు భరించలేని మణి మచ్చ లక్ష్మీతో పాటు ఇతరులను ప్రాదేయపడి ఒక పరిష్కారం సూచించాలని కోరింది.కాలనీలో పెద్దలందరు భార్యభర్తల మధ్య మధ్యవర్తిత్వం చేసి ఇగ కలిసి ఉండే పరిస్థితులు లేవనే నిర్దారణకు వచ్చారు. భార్యభర్తల అంగీకారంతో కాలోని వాసుల మధ్యనే 2023 విడాకుల కాగితం రాసుకుని వేరువేరుగా ఉంటున్నారు. మా భార్యభర్తలం విడిపోవడానికి ముఖ్య కారణం లక్ష్మీతో పాటు ఇతరులు అని పగ పెంచుకున్న గంగదాస్ వారిని చంపివేయాలని అనుకుని 2025 సెప్టెంబర్ 02 న ఉదయం ఎనిమిది గంటలకు తాను తెచ్చుకున్న కత్తెరతో లక్ష్మీ ని పొడిచి హత్య చేసే ప్రయత్నం చేయగా ఆమె కూతురు గౌతమి అడ్డుపడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇదే అదనుగా బావించిన అతను లక్ష్మీ ని కత్తెరతో పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అడ్డుకోబోయిన శోభ, నాగరాజు లను కత్తెరతో పొడిచి హత్యయత్నం చేశాడు. గాయపడిన వారి అరుపులకు చుట్టుపక్కల వారు రావడంతో పరుగులు తీసుకొని పోతు పోతు మధ్యలో బోజేశ్వర్ పై కత్తెరతో పొడిచి హత్యయత్నం చేశాడు.తీవ్రంగా గాయపడిన లక్ష్మీని ఇతరులను కాలనీవాసులు అంబులెన్సు లో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చేర్పించారు. వైద్య చికిత్స పొందుతూ లక్ష్మీ రాత్రి మరణించింది.పై నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయి గంగదాస్ కు హత్య నేరంకు గాను జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా, నలుగురిపై హత్యయత్నం చేసిన నేరంకు గాను మరో జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విదిస్తూ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు చెప్పారు. జరిమానాలు చెల్లించకుంటే అదనంగా మూడు సంవత్సరాల చొప్పున సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలన్నారు.
-ఉరి శిక్ష విధించాలని కోరిన ముద్దాయి గంగదాస్
- జడ్జి దుర్గా ప్రసాద్ ముద్దాయి కోర్టు హల్ లో ముద్దాయి సమక్షంలో తీర్పు చదివి, గంగదాస్ ను ఉద్దేశిస్తూ మీపై హత్య, హత్యయత్నం నేరాలు రుజువు అయినాయి.చట్ట ప్రకారం ఉరి శిక్ష, జీవిత కారాగార శిక్ష విధించే అవకాశం ఉన్నది ఏమైనా చెప్పుకునేది ఉన్నదా ? అని అడగగా తనకు ఉరి శిక్షనే ఖరారు చేయమనడంతో...స్పందించిన జడ్జి అత్యంత క్రూరమైన హత్య నేరాలలో మాత్రమే ఉరి శిక్ష ఉంటుందని ముద్దాయికి తెలిపి జీవిత కారగార శిక్షలు విదిస్తున్నట్లు ప్రకటించారు.






