ప్రజలను చైతన్యపరుస్తున్న నిజామాబాద్ పోలీస్ కళాబృందం
నిజామాబాద్ పోలీస్ కళాబృందం ప్రజలకు విస్తృతంగా అవగాహన

ప్రజలను చైతన్యపరుస్తున్న నిజామాబాద్ పోలీస్ కళాబృందం
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ అర్బన్:
నిజామాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల రక్షణ, మూఢనమ్మకాలు, చైన్ స్నాచింగ్ తదితర అంశాలపై నిజామాబాద్ పోలీస్ కళాబృందం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని గ్రామాలు, పట్టణాల్లో పాటలు, నాటకాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తోంది.పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన కళాబృందం ప్రజలకు అర్థమయ్యే రీతిలో సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తోంది. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1908కు తెలియజేయాలని సూచిస్తోంది. కల్తీ కల్లు వల్ల కలిగే అనారోగ్యంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగించకపోవడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వంటి వాటికి దూరంగా ఉండాలని కళాబృందం సూచిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ప్రచారం చేస్తోంది.మహిళల రక్షణ కోసం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, అందుబాటులో ఉన్న రక్షణ సేవలపై అవగాహన కల్పిస్తోంది. మహిళలకు ఏదైనా అసౌకర్యం ఎదురైతే షీ టీమ్ నంబర్ 87126-59795 లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలను వినియోగించుకోవాలని చెబుతోంది.ఆన్‌లైన్ మోసాలపై కూడా కళాబృందం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచిస్తోంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను రికవరీ చేసుకునే అవకాశం ఉందని వివరిస్తోంది. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించుకోవాలని, చైన్ స్నాచింగ్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలు తదితర అంశాలపై కూడా పాటలు, నాటకాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ప్రజల్లో నేరాలపై ముందస్తు చైతన్యం తీసుకురావడమే కళాబృందం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.జనవరి 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు 106 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. గ్రామాల్లో కళాబృందం ప్రదర్శనలకు మంచి స్పందన వస్తోందని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నూతన పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.






