Mana Indur News
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

త్వరలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు - రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

KA
By KARKA RAMESH•September 16, 2026
2
Share
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షులుగా మొగుళ్ళ రాజి రెడ్డి ఎన్నిక

తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ లో విలీనం

వేలాదిమంది ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం

మన ఇందూర్ హైదరాబాద్:

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. హైదరాబాద్, నాగోల్, కల్యాణ లక్ష్మి గార్డెన్స్ లో బుధవారం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేలాదిమంది ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి ఈ. అశ్వథామ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనంలో ఎమ్యెల్సీ ప్రో. ఏం. కోదండరాం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏ.పి. మిథున్ రెడ్డి, ప్రముఖ గాయకులూ నల్గొండ గద్దర్, ఐ.ఎన్.టి.యు.సి సంయుక్త కార్యదర్శి ఇందిరా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు వేదికపై ఆసీనులైనారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ లో విలీనమైందని, వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షులుగా మొగుళ్ళ రాజి రెడ్డి ని ఈ సమ్మేళనం ఏకగ్రీవంగా ఎన్నుకుందని ఈ. అశ్వథామ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల పక్రియ జరుగుతుందని, త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై తనకు మొదటి నుంచే అవగాహన ఉందన్నారు. 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో ఇ. అశ్వత్థామ రెడ్డితో కలిసి తాను అనేక డిపోలను సందర్శించి కార్మికులకు అండగా నిలిచానని మంత్రి తెలిపారు. పలు డిపోలకు వెళ్లి కార్మికులను కలసి వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా సమ్మెలో ఉన్న కార్మికులను కలిసి వారికి మద్దతు తెలిపినట్లు గుర్తుచేశారు. కార్మికులకు న్యాయం జరిగితే ఉత్పాదకత పెరుగుతుందని, సంస్థలు కూడా మెరుగ్గా పనిచేస్తాయని మంత్రి అన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థల అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. 4,584 కొత్త ఉద్యోగాల భర్తీ జరిగిందని చెప్పారు. కారుణ్య నియామకాల ద్వారా కూడా 2వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు కావడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ఈ పథకం ప్రయోజనం అందుతోందని తెలిపారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ తదితర బకాయిలను తగ్గించుకుంటూ వస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఇప్పటికే కార్మిక నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. చిన్నచిన్న సమస్యలపైనా అధికారులు స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, తాను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. కోదండరాం మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి సానుకూలంగా ఉందని తెలిపారు. బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ జలమండలిలో మొగుళ్ళ రాజి రెడ్డి అన్ని విభాగాల కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేసాడని, ఫలితంగా జలమండలి ఉద్యోగులు మొగుళ్ళ రాజి రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేసారు. త్వరలో జరిగి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో నూతన అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అభ్యర్థి ఈ. అశ్వథామ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మొగుళ్ళ రాజి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి సానుకూలంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని, త్వరలో జరిగి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐ.ఎన్.టి.యు.సి అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (A-4522) విజయానికి ప్రతియొక్క ఆర్టీసీ కార్మికుడు కృషి చేయాలనీ కోరారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5