యమ్స్ కు బోటింగ్, వరద సహాయక చర్యలపై ప్రత్యేక శిక్షణ
7 వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న యువ ఆపదమిత్రుల (యమ్స్ ) కోర్సు

మన ఇందూర్ నిజామాబాద్
7 వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న యువ ఆపదమిత్రుల (యమ్స్ ) కోర్సులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీ సాగర్‌లో బోటింగ్, వరద సహాయక చర్యలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. బోటింగ్ నిర్వహణ, నీటిలో సురక్షిత ప్రయాణం, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే విధానాలపై యువ ఆపదమిత్రులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వరదల సమయంలో బాధితులను గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం, రెస్క్యూ పరికరాలు, లైఫ్ జాకెట్ల వినియోగంపై శిక్షకులు ప్రదర్శన ద్వారా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ముందుగా స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితిని అంచనా వేసిన తర్వాత శిక్షణ పొందిన విధానాల ప్రకారమే రెస్క్యూ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందించడంతో పాటు సంబంధిత రెస్క్యూ బృందాలకు సమాచారం ఇవ్వడం కీలకమని తెలిపారు. ఈ శిక్షణతో విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే నైపుణ్యాలు, అప్రమత్తత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం యువ ఆపదమిత్రుల్లో పెంపొందించేల ఈ శిక్షణ ఉపయోగపడిందని వారు తెలిపారు.






