నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మన ఇందూర్ నిజామాబాద్ సిటీ:
నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు మొత్తం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, మరోసారి రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు.
అయితే విడుదలైన నిధుల్లో సింహభాగం ఇప్పటికీ అధికారుల ఖాతాల్లోనే ఉండి, లబ్ధిదారులకు అందించకపోవడం పట్ల ఒకింత చేరకపోవడం ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్లు భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధులు చాలకపోయినా, ఇతర కారణాల వల్ల చెల్లింపులు సాధ్యం కాకపోతే ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని సకాలంలో భూసేకరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి, పనులను వేగవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులు గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






