Mana Indur News
కల్చరల్

చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రజలు ఐక్యంగా పోరాడాలి

RSP పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహణ.

KA
By KARKA RAMESH•September 26, 2026
2
Share
చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రజలు ఐక్యంగా పోరాడాలి

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:

రీవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రైతాంగ ఉద్యమ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా RSP జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ.. నిజాం పాలనలోని భూస్వామ్య, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన అసామాన్య మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ ప్రజా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడం అంటే ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు చేయడమేనని, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, కార్మికులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విద్యా–వైద్య రంగాల నిర్లక్ష్యం, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిట్ల నరేష్, AIPSU నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, సూర్యపాల్, రంజిత్, రాజేందర్, కృష్ణ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5