ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని కమర్షియల్ వ్యాపారానికి వినియోగించడం తగదు
గిరిరాజ్ కళాశాలలో అసోసియేషన్ ముసుగులో కమర్షియల్ క్రికెట్ అకాడమీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని కమర్షియల్ వ్యాపారానికి వినియోగించడం తగదు
గిరిరాజ్ కళాశాలలో అసోసియేషన్ ముసుగులో కమర్షియల్ క్రికెట్ అకాడమీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి – AISF, AIPSU
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల ఆవరణలో కమర్షియల్ పద్ధతిలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ AISF, AIPSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ సదుపాయం కళాశాల విద్యార్థుల క్రీడా అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ పేరును వాడుకొని ప్రైవేట్ అకాడమీ గా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తూ కమర్షియల్‌గా నిర్వహించడం ఆందోళనకరమని అన్నారు.
ప్రభుత్వ భూమి, ప్రభుత్వ వనరులను వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గిరిరాజ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా క్రికెట్ శిక్షణ పొందే అవకాశం కల్పించాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రీడలకు దూరం కాకుండా ప్రభుత్వం అందించిన సదుపాయాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థి సంఘాల వినతిపై స్పందించిన గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యదర్శి రఘురాం, AIPSU జిల్లా కార్యదర్శి బోడ అనిల్, AISF గిరిరాజ్ కళాశాల అధ్యక్షుడు నగేష్, కార్యదర్శి కిషోర్,అనూష సన్ని, రాజేష్, భాను,సొన్ రాజ్,రాంచరణ్, నిరాజ్, AIPSU నాయకులు రంజిత్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.






