Mana Indur News
స్థానిక వార్తలు

రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి

KA
By KARKA RAMESH•November 13, 2026
2
Share
రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి

రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి

యంగ్ ఇండియా పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీ.ఎస్ సంజయ్ జాజు

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:

రాబోయే రబీ 2026-27 సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. కూరగాయలు వంటి ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు.

శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీజీరాంజీ పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీ.ఎస్ మాట్లాడుతూ, రబీ 2026-27 సీజన్‌లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని అన్నారు. పంటల వైవిధ్యీకరణ, పంటల ఉత్పాదకత పెంపు, రైతు రిజిస్ట్రీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర పథకాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినప్పటికీ, కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచాలని, రైతులందరి వివరాల నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం సేకరణ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యాశాఖపై సమీక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరుపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరును పర్యవేక్షించాలని, విద్యార్థుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగ్గా ఉంటే విద్యార్థుల హాజరు కూడా పెరుగుతుందని, క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ అభ్యసన వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రూసా 2.0, పీఎం ఉషా పథకాల కింద మొత్తం 41 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు 8 పనులు పూర్తయ్యాయని, మరో 33 పనులు పురోగతిలో ఉన్నాయని సీఎస్ తెలిపారు. మంజూరైన నిధుల్లో ఇప్పటివరకు 41 శాతం మాత్రమే ఖర్చు చేసినందున మిగిలిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.625 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పనుల పురోగతిని కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

అదేవిధంగా రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సీఎస్ సూచించారు. భూసేకరణ కోసం అవసరమైన నిధులను కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని సీఎస్ సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీబీజీరాంజీ కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఖరీఫ్ లో వర్షాలు అనుకూలించడం వల్ల జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారని, దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వస్తున్నాయని, మంచి ధర లభిస్తోందని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. అయితే ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగు చేయడం ఎంతమాత్రం తగదని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఏఓ వీరస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5