Mana Indur News
స్థానిక వార్తలు

ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

అధికారులతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా

MI
By Mana Indur News•September 28, 2026
1
Share
ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

అధికారులతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్: ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణను కొనుగోలు కేంద్రాల ద్వారా అక్టోబర్ 1వ తేదీ నుండి చేపట్టనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ధాన్యం అమ్మకాల విషయంలో రైతులకు ఏ దశలోనూ ఇబ్బందులు ఎదురుకాకూడదని కలెక్టర్ సూచించారు. ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించామని, తదనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగేలా అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు. సకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషీన్లు వంటి సదుపాయాలు సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గిడ్డంగులు, ఫంక్షన్ హాళ్లు, ఆయా ప్రదేశాలను క్షేత్రస్థాయిలో గుర్తించడం జరిగిందని అన్నారు. వీటితో పాటు డిఫాల్ట్ జాబితాలో లేని రైస్ మిల్లులకు సైతం ధాన్యం కేటాయించేలా ప్రభుత్వం తాజాగా అనుమతించిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హమాలీల కొరత తలెత్తకుండా, ధాన్యం రవాణా సకాలంలో జరిగేలా సరిపడా సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీ.పీ.ఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధారించిన 7 రకాల సన్నాలను పక్కాగా గుర్తించేలా సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు తగిన శిక్షణ అందించాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు అక్రమంగా ధాన్యం రవాణా జరగకుండా సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి డీసీఓ శ్రీనివాస్ రావు మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగుబాయి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5