Mana Indur News
స్థానిక వార్తలు

భూముల రీసర్వే ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలి

భూ హద్దులు, రికార్డుల వివరాలను పక్కాగా నమోదు చేయాలి

KA
By KARKA RAMESH•November 15, 2026
2
Share
భూముల రీసర్వే ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలి

భూముల రీసర్వే ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలి

భూ హద్దులు, రికార్డుల వివరాలను పక్కాగా నమోదు చేయాలి

అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

బాచన్ పల్లిలో రీ సర్వే ప్రక్రియ పరిశీలన

మన ఇందూర్ న్యూస్/ భీంగల్ :

భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న రీసర్వే పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేలో భాగంగా భూముల హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, భూ విస్తీర్ణాన్ని కొలవడం, సంబంధిత భూ రికార్డులతో వివరాలను సరిపోల్చడం తదితర ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు. రీసర్వే సమయంలో ప్రతి భూమికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భూ యజమానుల వివరాలు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, హద్దులు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన వివరాలను సంబంధిత రికార్డులతో సరి చూసుకోవాలని అన్నారు. భూ యజమానులకు ముందస్తు సమాచారం అందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేయాలని, భూముల హద్దులు, విస్తీర్ణంపై వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి వెంటదివెంట పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రీసర్వే పూర్తయిన అనంతరం భూ రికార్డులు మరింత కచ్చితత్వంతో అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్‌లో భూ వివాదాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రీసర్వే పనులను వేగవంతం చేయాలని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. రీసర్వే పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనసాగేలా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు. రీ సర్వే కోసం వినియోగిస్తున్న రోవర్ మెషిన్లను మరిన్ని జిల్లాకు తెప్పిస్తున్నామని, వీటిని వినియోగిస్తూ అదనపు బృందాలను ఏర్పాటు చేసి సకాలంలో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఉత్తమ పనితీరు కనబర్చే సర్వేయర్లకు ప్రతి నెల ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషికాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్, తహసీల్దార్ కిరణ్, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5