Mana Indur News
స్థానిక వార్తలు

లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుకై లబ్ధిదారుల ఎంపిక

మున్సిపల్ సిటిజన్ సర్వీస్ సెంటర్ భవనంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లక్కీ డ్రా..

MI
By Mana Indur News•September 28, 2026
0
Share
లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుకై లబ్ధిదారుల ఎంపిక

లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుకై లబ్ధిదారుల ఎంపిక

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో గల రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కోసం సోమవారం మున్సిపల్ సిటిజన్ సర్వీస్ సెంటర్ భవనంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లక్కీ డ్రా నిర్వహించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ల పర్యవేక్షణలో ఈ లాటరీ ప్రక్రియ జరిగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అర్హత కలిగిన వారి పేర్లను అందరి సమక్షంలో డ్రా తీస్తూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. ఎలాంటి పొరపాట్లు, అనుమానాలకు తావు లేకుండా వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్హులుగా ఖరారైన దరఖాస్తుదారుల సమక్షంలో, వీడియోగ్రఫీ చిత్రీకరణ మధ్య పూర్తి పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను విజయవంతంగా జరిపించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎస్టీ లకు 6 శాతం, ఎస్సీలకు 17 శాతం, మైనారిటీలకు 12 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేస్తూ లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తూ పేర్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ బి.చంద్రశేఖర్, హౌసింగ్ ఈ.ఈ జె.రాజ్యలక్ష్మి, నార్త్ తహసీల్దార్ హరికిశోర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, లాటరీ ద్వారా రెండు పడక గదుల ఇల్లు కేటాయించబడిన లబ్ధిదారులు తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5