Mana Indur News
స్థానిక వార్తలు

ఇందిరమ్మ టవర్స్‌" కు విశేష స్పందన

అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

KA
By KARKA RAMESH•November 17, 2026
5
Share
ఇందిరమ్మ టవర్స్‌" కు విశేష స్పందన

"ఇందిరమ్మ టవర్స్‌" కు విశేష స్పందన

అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతం ఆర్‌జీకే కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ల కేటాయింపు కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్న అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్‌జీకే కాలనీలో 480 ఫ్లాట్ల కేటాయింపునకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 512 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి లబ్ధిదారుడి వాటాగా తాత్కాలికంగా రూ.3.50 లక్షలు నిర్ణయించబడిందని, ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.అర్హత కలిగిన దరఖాస్తుదారులను ముందుగా ఐడీ వెరిఫికేషన్ ద్వారా గుర్తించి, అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ లేని వారు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన నిజామాబాద్ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిసెంబర్ 5వ తేదీ లోపు మీ సేవా కేంద్రాల ద్వారా లేదా అధికారిక మీ సేవా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5