ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో ఘనంగా నిర్వహణ. AISF నిజామాబాద్ జిల్లా కార్యాలయం ముందట గోడ ప్రతుల ఆవిష్కరణ

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ తెలిపారు. భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ రైల్వే స్టేషన్ దగ్గర ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయం ముందట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 11 వేల కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల శాపంగా మారిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకుల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఏకైక జాతీయ విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని వారు తెలిపారు.1936 ఆగస్టు 12న లక్నోలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు జాతీయ సమైక్యత కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమిస్తూ, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అదే విధంగా దేశానికి అనేక మంది గొప్ప నాయకులను ఏఐఎస్ఎఫ్ అందించిందని తెలిపారు.అటువంటి విప్లవాత్మక జాతీయ విద్యార్థి సంఘం 90 వసంతాలు పూర్తి చేసుకుని 91వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వార్షికోత్సవాలను సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో అంగరంగ వైభవంగా, ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.మూడు రోజులపాటు జరిగే ఈ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యలు, ఫీజు బకాయిలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు, యూనివర్సిటీల సమస్యలు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య తదితర అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నట్లు తెలిపారు.అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే పలు కీలక తీర్మానాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఈ రాష్ట్రస్థాయి చర్చలకు, భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలకు వేదికగా నిలవబోతుందని తెలిపారు.హనుమకొండ వేదికగా మూడు రోజులపాటు జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది డెలిగేట్లు హాజరుకానున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సంతోష్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాసరావు, అలాగే విద్యారంగ సంస్కరణవాదులు పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా AISF కార్యకర్తలు మరియు మేధావులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుభోద్, నాయకులు నిరాజ్, సన్ని,గణేష్, విష్ణు, సాయి పవన్ ,నగేష్ భాను, రాజేష్ ,మహి తదితరులు పాల్గొన్నారు.






