Mana Indur News
స్థానిక వార్తలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలి

నవంబర్ 19 నుంచి బీమా పథకం అమలు

KA
By KARKA RAMESH•November 13, 2026
3
Share
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నవంబర్ 19 నుంచి బీమా పథకం అమలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ

గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక నమోదు కేంద్రాలు

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించనున్నదని తెలిపారు.

ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమల్లోకి వస్తుందని, దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన తాజా కులగణన సర్వే ద్వారా కుటుంబాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా రేషన్ కార్డుల ఆధారంగా కూడా కుటుంబాల వివరాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని ఈ పథకం అమలులో వినియోగించుకోవాలని తెలిపారు.

ప్రతి గ్రామం, వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు

నవంబర్ 19న జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో డివిజన్/ వార్డు స్థాయిలో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి పథకం సమాచారం చేరేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఒక రోజు ముందే నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కుటుంబ పెద్ద తమ కుటుంబానికి సంబంధించిన నామినీ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని, ఒకరు లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ప్రతిపాదించవచ్చని కలెక్టర్ సూచించారు. జీవిత బీమా కవరేజీ కోసం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సంపాదన సభ్యుల వివరాలను కచ్చితంగా సేకరించాలని సూచించారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డు వివరాలతో పాటు బీమా పొందే వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు కూడా సేకరించాలన్నారు. నామినీ పేరు, సంబంధం, ఆధార్ వివరాలతో పాటు ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలుగా ఉంటే వారికి కేటాయించే వాటా వివరాలను నమోదు చేయాలని తెలిపారు. నామినీ మైనర్ అయితే వారి సంరక్షకుడు లేదా ప్రతినిధి వివరాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. దరఖాస్తుపై దరఖాస్తుదారుడితో పాటు వివరాలను పరిశీలించిన అధికారి సంతకం ఉండాలని స్పష్టం చేశారు.సేకరించిన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేసి, సంతకం చేసిన దరఖాస్తుల స్కాన్ ప్రతులను బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.నామినీ వివరాలు, ఆధార్ నంబర్లు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డిజిటల్ రికార్డుల్లోనూ కచ్చితత్వం పాటించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, సీపీఓ రతన్, ఇంచార్జి డీపీఓ నాగరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5