కులమతాలకు అతీతంగా అన్న ప్రసాదం
యువ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

మన ఇందూర్ ఇందల్వాయి:
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇందల్వాయి మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన, గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన ఈ అన్నప్రసాద కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాల్లో భాగంగా యువ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కులమతాలకు అతీతంగా గ్రామంలోని ప్రజలంతా ఒకే చోటకు చేరి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
నిత్య పూజల్లో భక్తుల భాగస్వామ్యం
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా హాజరవుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఉత్సవాలను ఐక్యత, భక్తి భావంతో నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నారైల సహకారంతో అన్నదానం
ఈ అన్నదాన కార్యక్రమానికి కీ.శే. డాక్టర్ బాపురెడ్డి, లక్ష్మి, జల విజయరెడ్డి, జీత్నరెడ్డి ఎన్నారైలు అన్నదాతలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మండపం పరిసరాలు సందడిగా మారాయి. యువ చైతన్య యూత్ గణేష్ మండలి అధ్యక్షుడు గంగిరెడ్డి రవి, ఉపాధ్యక్షుడు రాము, మండలి సభ్యులు సంతోష్, నవీన్ గౌడ్, స్వామి, శీను, రాకేష్, సన్నీ, అశోక్, భోజి, ప్రశాంత్, నవీన్ తదితరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
ఐక్యతకు ప్రతీకగా గణేష్ ఉత్సవాలు
గణేష్ ఉత్సవాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామంలో భక్తి, సేవాభావం, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.






