ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి.

అర్హులైన నిరుద్యోగ కళాకారులు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్హులైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిజామాబాద్ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి వద్ద నిర్వహించనున్న శాంతియుత నిరసన కార్యక్రమానికి నిజామాబాద్ కళాకారులు వెళ్లడానికి సిద్ధం కాగా.. ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకొని పోలీసులు నిజామాబాద్ కళాకారులను ఎక్కడికక్కడే ముందస్తుగా నిర్బంధించారు. హైదరాబాద్ నిరసన కార్యక్రమానికి వెళ్ళవద్దని సూచించారు. అయినప్పటికీ కళాకారుల చిరకాల వాంఛ అయినా ఉద్యోగాలకై తాడోపేడో కొంతమంది కళాకారులు హైదరాబాద్ రవీంద్రభారతి వద్దకు చేరుకున్నారు. ప్రధాన కార్యదర్శి గణేష్, కళాకారుడు గోపాల్ ఒకరోజు ముందుగానే నిరసన కోసం వెళ్లారు.
ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి..
కళాకారుల బతుకులలో వెలుగులు నింపాలి.
తెలంగాణ కోసం గోసి గొంగడి కట్టి ఉన్న పనులను వదిలిపెట్టి, కుటుంబానికి దూరం ఉండి తెలంగాణ వస్తే మా బతుకులు బాగవుతాయని, భవిష్యత్తు బాగుంటుందని, నమ్మి ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహించి, ఊరురా తిరిగి ప్రజల్లో చైతన్యం కల్పించామని, ఇప్పుడు కళాకారుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పారని అన్నారు. వెయ్యి రోజులు గడిచిన ఇప్పటివరకు ఉద్యోగాల ప్రకటన ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్టాయిలో ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 200కు పైగా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఉన్నారని, 25 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం సరికాదన్నారు. నిజామాబాదు నుంచి అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
నిరసన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసు యంత్రాంగం.
చిట్టి బాబు,కర్క రమేష్, మహేందర్, పొగరీ సంజీవ్, గోదావరి, స్రవంతి, సంతోష్, నరేష్, శ్రీధర్ లతో పాటు నిజామాబాద్ జిల్లా కళాకారులను పోలీసులు ఇంటి వద్దే ముందస్తుగా నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.






