Mana Indur News
తెలంగాణ

చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం.. కల్వకుంట్ల కవిత

నేను బహుజనుల బాణాన్ని యువకుల యుద్ద నినాదాన్ని పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా

KA
By KARKA RAMESH•September 20, 2026
12
Share
చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం.. కల్వకుంట్ల కవిత

సాయిత్రి భాయి పూలే ఆశయాలు నింపుకొని మగ మహారాజులకు ఛాలెంజ్ చేస్తున్న వీరవనితను నేను

నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుత

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

మన ఇందూర్ కోస్గీ - కొడంగల్ :

"నేను బహుజనుల బాణాన్ని.. యువజనుల యుద్ద నినాదాన్ని, అంబేడ్కర్ వాదాన్ని. పూలే  ఆత్మగౌరవ నినాదాన్ని.. సాయిత్రి భాయ్ పూలే ఆశయాలను నింపుకొని నిటారుగా నిలబడి మగమహారాజులకు ఛాలెంజ్ విసురుతున్న వీరవనితను నేను" అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బీఆర్ఎస్ వదిలిన బాణమని కొంతమంది, కాంగ్రెస్ బాణం అంటూ మరికొంతమంది చేస్తున్న విమర్శలకు కొడంగల్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గీలో ఆదివారం నిర్వహించిన  పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడారు. తాను బహుజనుల బాణాన్ని అని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీలతో పోారాటం చేసి చూపిస్తానన్నారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానన్నారు. ఇన్నాళ్లు అయ్యాల పాలనలో ఒరిగిందేమీ లేదని ఇక తెలంగాణలో మాతృస్వామ్యం తెచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే చేసేందేమీ లేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలాగా ఆలోచించి పాలన సాగిస్తానన్నారు.

ప్రజల కోసమే పార్టీ పెట్టా

తెలంగాణలో మాతృస్వామ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరముందని కవిత అన్నారు. ఇన్నాళ్లు అయ్యాలు చేసిన పాలనలో మన బతుకులు ఏం మారాయో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాకముందు జరిగిన అన్యాయానికి ఆంధ్రోళ్లు బాధ్యులని అనుకున్నామని కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మన బతుకులు ఏం మారాయని ప్రశ్నించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. బాధ్యతలేని పార్టీలు, నాయకుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కదనరంగంలో యుద్దం చేసే నాయకుల అవసరముందన్నారు. అందుకోసం తాను పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చానని చెప్పారు. తనకోసమో, కొంతమంది నాయకుల కోసమో పార్టీ పెట్టలేదని, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేందుకే తెలంగాణ రక్షణ సేన పెట్టానని చెప్పారు. కోస్గీకి తాను 2009 లో టీడీపీతో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చానని అన్నారు. వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారని తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే తాను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తాననే విశ్వాసం ఉందన్నారు.

పాంచజన్యంతో ప్రజల జీవితాల్లో వెలుగులు

సమాజంలో ఆధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది ధర్మపోరాటాన్ని చేస్తారని....తాము కూడా తెలంగాణ రక్షణ సేన ద్వారా అదే పనిచేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు విద్య కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. జనంబాటలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే అక్కడి పరిస్థితిని ఓ మహిళ తనకు చెబుతుంటే ఎంతో ఆవేదన చెందానన్నాారు. తన బిడ్డకు పుట్టిన బిడ్డను చూడాలంటే వెయ్యి రూపాయలు లంచం అడిగారని ఆమె చెప్పిందన్నారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎంత పెద్ద జబ్బైనా సరే ఒక్క రూపాయి కూడా ప్రజలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇవ్వన్నీ చెబుతుంటే కొంతమంది చిన్నపిల్ల, ఆడబిడ్డ అంటూ నవ్వుతున్నారని కవిత అన్నారు. కానీ తాను ఒక తల్లిని అని తల్లి హృదయంతో ఆలోచిస్తానని చెప్పారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ను నమ్మోద్దు అంటున్నాడు. మరి ఆయన బూతులను నమ్మాలా అని ప్రశ్నించారు. మన యువతను నమ్మి వారి బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు.

పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా

రాష్ట్రంలో రైతుల పరిస్థితి పై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, కరెంట్, నీళ్లు, రైతు భరోసా, మద్దతు ధర ఇలా ప్రతి దానికి రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకుంటున్న సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయన్నారు. రైతులకు కనీసం సాగు నీళ్లు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శించారు. జురాల వద్ద రెగ్యులేటర్ ను పగలకొట్టి రైతులు నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జురాల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్న సరే చేయటం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక జురాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణ్ నుంచి ఇబ్రహీం పట్నం వరకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని భరోసా ఇచ్చారు. లేదంటే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు.

కవిత నోట గద్దర్ పాట

కోస్గీ సభలో గద్దర్ పాటతో కవిత ఆకట్టుకున్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల తీరు గురించి చెబుతూ ఆమె గద్దర్ పాటను పాడారు. భలే గుంది అసెంబ్లీ అంటూ గద్దర్ గతంలో పాడిన పాటను పాడి వినిపించటంతో ప్రజలంతా పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు.

కిక్కిరిసిన సభ ప్రాంగణం

కోస్గీ సభ ప్రాంగణం వేలాది మంది ప్రజలతో కిక్కిరిసి పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కవిత రాకకోసం జనం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభమయ్యే సరికి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి కొడంగల్ కు 200 కార్లతో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వచ్చారు. హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ నుంచి కోస్గీ వరకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు కవితకు అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.  కొడంగల్ నుంచి కోస్గీ వరకు  20 కిలీమీటర్ల దూరం కవిత ప్రత్యేక బస్సులో ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. కోస్గీ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాను కవిత ఆవిష్కరించారు.

సీఎం .. సీఎం నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం

కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ ప్రాంగణం సీఎం సీఎం నినాదాలతో మార్మోగింది.. కల్వకుంట్ల కవిత మాట్లాడేందుకు ముందుకు వచ్చిన సమయంలో ప్రాంగణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీఎం సీఎం అని నినాదాలు చేశారు.

చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తాను, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మహా కూటమి తరపున ప్రకారం చేశామని గుర్తు చేశారు. ఆ రోజు కోస్గి సభలో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంలు అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5