నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి
జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క

నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి
జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క
త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి నివేదిస్తామని వెల్లడి
ఆర్మూర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాలు పంపిణీ
మన ఇందూర్ న్యూస్/ఆర్మూర్:
వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేయూత పథకం కింద ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లను మంత్రి సీతక్క లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ పదేళ్ళ పాలనలో నిజామాబాద్ జిల్లా ఆశించిన విధంగా అభివృద్ది చెందలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం గత మూడు సంవత్సరాల నుండి రోడ్ల నిర్మాణాలు తదితర వాటికి నిధులు కేటాయిస్తున్నామని, అయితే ఇంకనూ పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సి ఉందని తెలిపారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిగి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతామని, ఈ ప్రాంత పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా నివేదిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే చేయూత పథకం కింద వివిధ వర్గాల వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఇదే తరహాలో బీడీ కార్మికులకు సంబంధించి కూడా వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని, స్వయం సహాయక సంఘాలకు ఇతోధికంగా ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. మహిళలు సంఘాలలో సభ్యులుగా చేరి ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్ధిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేయడంతో పాటు వ్యాపార లావాదేవీల నిర్వహణకు ఊతమందిస్తోందని గుర్తు చేశారు. విద్యారంగ అభివృద్దిని కాంక్షిస్తూ ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లను వెచ్చిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తోందని అన్నారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని అన్నారు. గత పాలకులు అనాలోచిత విధానాలతో ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులకు ప్రతీ నెల 6వేల కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ఎక్కడ కూడా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన విజన్ తో కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామని, డిచ్ పల్లిలో అన్ని వసతులతో కూడిన అతిథి గృహం నిర్మాణానికి, నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ అమలు కోసం కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 3150 మందికి నూతనంగా చేయూత పెన్షన్ లు జారీ కాగా, మంత్రి సీతక్క పలువురికి లాంచనంగా మంజూరీ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఆర్మూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, మున్సిపల్ చైర్ పర్సన్ లహరి, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






