స్పెషల్ ఫండ్ కేటాయిస్తే మరింత అభివృద్ధి
8వ డివిజన్ లో నిర్మించే రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

స్పెషల్ ఫండ్ కేటాయిస్తే మరింత అభివృద్ధి..
8వ డివిజన్ లో నిర్మించే రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కేటాయిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 8వ డివిజన్ లో గల సీతారాంనగర్ కాలనీ బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో నిర్మించే రోడ్డు పనులకు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయించిన 20 లక్షల నిధులతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని డివిజన్లో కోటి రూపాయల పనులు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ కేటాయించలేదని చెప్పారు. మూడేళ్ళయినా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నగరంలో కొన్ని డివిజన్ లలో నూతన కాలనీలు ఏర్పడుతున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్ మఠం పవన్, కాలనీ పెద్దలు కిషన్, శ్రీనివాస్, విశ్వ సాయి, శివశంకర్, లింగాల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.






