Mana Indur News
రాజకీయం

కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి

నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తాం.. ///////////////////////////////// మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు..

KA
By KARKA RAMESH•October 19, 2026
8
Share
కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి

కన్నెపల్లి పంప్ హౌస్ - కాళేశ్వరం

కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి

నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తాం

మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు

ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను చెబుతున్నాం

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

మన ఇందూర్ న్యూస్/కాళేశ్వరం:

కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రాణహిత ప్రవాహాన్ని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా బాధలో ఉన్నారన్నారు. నిజానికి మన తెలంగాణలో ఉన్న రెండు పెద్ద నదులు గోదావరి, కృష్ణా నీళ్లను సరిగా వాడుకుంటే మనకు కరువు అనే పరిస్థితే ఉండదని, మనం తెలంగాణ కోసం పిడికిలి ఎత్తి ఉద్యమం చేసింది కూడా మా నీళ్లు మాకు కావాలనే అని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక మన నీటిని సంపూర్ణంగా వాడుకున్నామా అంటే వాడుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వానలు సరైన టైమ్ కి రావటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా టైమ్ గడిచిపోయిందని, బీఆర్ఎస్ టైమ్ లో కృష్ణా నది ప్రాజెక్ట్ ల పై కొంత పనులు చేసి 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారన్నారు. ఉత్తర తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు కు నీళ్లు ఇస్తూ 37 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి స్థిరీకరణ మాత్రమే చేశారు. కాళేశ్వరంలో కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు.ఈ విషయం మనం చెబితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మనపై దాడి చేస్తారన్నారు.కానీ నిజాలు మారవు. వాస్తవాలు కచ్చితంగా కఠినంగానే ఉంటాయన్నారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఘోరంగా పరిస్థితి తయారైందని,రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.అడిగితే బకాయిలు చెల్లించామని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, దళిత బంధు లాంటి బకాయిలు చెల్లించకుండా ఇవే ఎందుకు చెల్లించినట్టు అని ప్రశ్నించారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాణహిత నది వద్ద ఎంత కరువు పరిస్థితులు ఉన్న సరే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతుంటాయి.వీటిని సరిగా వాడుకుంటే మన రైతుల పొలాలకు నీళ్లు మంచిగా ఇవ్వొచ్చు అన్నారు.అందుకే ఈ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇస్తూ సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తున్నామన్నారు. మేము పార్టీ పెట్టిన కొత్తలో కూడా కృష్ణానది నీళ్లకు సంబంధించి నార్లపూర్ వద్ద రిజర్వాయర్ గురించి సొల్యుషన్ చెప్పామని, ఇప్పుడు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల పైన కాఫర్ నిర్మిస్తే సమస్య పరిష్కరించవచ్చన్నారు.

మేడిగడ్డకు సంబంధం లేకుండా ఇక్కడ నుంచి అన్నారం, సుందిళ్లకు నీళ్లను ఎత్తిపోయవచ్చు అని, నీళ్ల ద్వారా ప్రతి ప్రాజెక్ట్ ను రీఛార్జ్ చేసుకోవచ్చన్నారు. రూ. 25 కోట్లు ఖర్చు పెడితే నెలన్నర రోజుల్లో ఈ పనులు పూర్తి చేయవచ్చన్నారు. ఎల్ నినో పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది కూడా వానలు పడుతాయో లేదో అని చెబుతున్నారు.కానీ ఇప్పుడు మన కళ్ల ముందే రోజు 2 టీఎంసీల నీళ్లు పోతున్న వాడుకోవటం లేదన్నారు.ఈ విషయంలో రైతుల కోసం ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నామని, ఒకవేళ ఈ ప్రభుత్వం వినకపోతే వారికి ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసని, తెలంగాణలో కోటి 36 లక్షల సాగు భూమి ఉంటే ఈ సారి కోటి 10 లక్షల ఎకరాలు సాగైందన్నారు.ఇప్పుడు పంట చివరి దశలో ఉంది. రైతులకు నీళ్లు, కరెంట్ అవసరం ఉంది. అందుకే మేము ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుక్కొనైనా, కొనుక్కవచ్చైనా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాం.మేము డిమాండ్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి స్పందించి కేంద్రాన్ని కరెంట్ అడుగుతామని చెప్పారు. సమస్యపై పోరాటం చేయటమే కాకుండా సొలుష్యన్ కూడా చెప్పాం. రాజకీయ పార్టీలు అంటే సమస్యను ప్రశ్నిస్తూనే సొల్యుషన్ కూడా చెప్పాలి.ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో కూడా కాఫర్ డ్యామ్ కట్టాలని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం.దానికి సంబంధించిన టెక్నికల్ డీయిటెల్స్ ను కూడా ప్రభుత్వానికి ఇస్తాంఅదే విధంగా మేడిగడ్డను కూడా రిపేర్ చేసేందుకు ఇదే సరైన సమయం. ఆ పనులు కూడా మొదలు పెట్టాలన్నారు.ఇప్పుడు మేము చేస్తున్న సూచనతో మేడిగడ్డకు సంబంధం లేకుండానే మొత్తం నెట్ వర్క్ ను రీఛార్జ్ చేసుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రతి రైతుకు తెలిసేలా పార్టీ నాయకులు వారికి వివరించాలన్నారు.కరెంట్, నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉండి ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగకుండా చేస్తామని, మేమిచ్చిన సూచనలో ఏమైనా మార్పులు ఉంటే..ఇంజనీర్లు వాటిని సరిచేసుకోమంటే చేసుకోవటానికి సిద్ధమని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిచేస్తే సరే. లేదంటే మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా ఈ ప్రతిపాదనలను పూర్తి చేస్తామన్నారు.ఎక్కడ పొలాలను చూసినా సరే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.అందుకే ప్రభుత్వానికి నీళ్లు ఎలా ఇవ్వొచ్చొ మార్గదర్శనం చేసేందుకు మేము ఇక్కడ వరకు వచ్చామని, ఈ ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి సంఘాల్లో కూడా రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు.రైతు సమస్యలకు సంబంధించిన సంఘాల్లో రాజకీయాలు వద్దని సూచిస్తున్నామని, కాళేశ్వరం కోసం దాదాపు 93 వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారనీ, కాళేశ్వరం నీళ్లను ఇచ్చేందుకు కాలువలు తవ్వకపోవటంతో కొత్త గా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వటం సాధ్యం కావటం లేదన్నారు.ఆ కాలువలను పూర్తి చేయాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలాగు అంత ఖర్చు చేసే పరిస్థితిలో లేదు ఇప్పటికే ఎల్లంపల్లి సహా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను తాగునీటి కోసం అని స్టోర్ చేశారు.రానున్న పదినెలలు మనం భయంకరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని, ఇప్పటికే 21 వేల చెరువులు ఎండిపోయి ముదిరాజ్, బెస్త సోదరులకు ఈ ఏడాది పనిలేని పరిస్థితి వచ్చిందని,ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.అందుకే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము చేస్తున్న మంచి సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5